న్యూఢిల్లీ: ఒలింపిక్ క్రీడల్లో భారత్‌ను ముందుకు నడిపించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ స్వయంగా నడుం బిగించారు. క్రీడల్లో సమూల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు. రియో ఒలింపిక్స్‌లో భారత్ ప్రదర్శనపై పొగడ్తలు, విమర్శల నేపధ్యంలో క్రీడలను ప్రతిష్టాత్మకంగా భావించిన మోదీ సంచలన ప్రకటన చేశారు. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా రానున్న మూడు ఒలింపిక్స్ క్రీడలకు టాస్క్ ఫోర్స్‌ను ప్రకటించారు. 2020, 2024. 2028 సంవత్సరాల్లో జరిగే ఒలింపిక్స్‌లో భారత ఉత్తమ ప్రదర్శనకు కావాల్సిన యాక్షన్ ప్లాన్‌ను ఈ దళం తయారు చేయనుంది. అందుకు కావాల్సిన క్రీడా సదుపాయాలు, శిక్షణ, ఎంపిక విధానం తదితర అన్ని విషయాలపై వీరు ఎప్పటికప్పుడు సాన పెట్టనున్నారు. దీంతో ఇక విశ్వ క్రీడల్లో భారత్ ప్రకాశించనుంది.