ప్రధానిగా మోడీకి సరితూగే వ్యక్తే లేరు
దేశవ్యాప్తంగా మోడీ మేనియా ఏ మాత్రం తగ్గడం లేదు. ఇండియా టుడే - కార్వే ఇన్‌సైట్స్ నిర్వహించిన సర్వేలో మరోసారి నరేంద్రుడికే అగ్రస్థానం దక్కింది. ప్రధానిగా మోడీకి సరితూగే వ్యక్తే లేరంటూ... మెజార్టీ భారతీయులు భావిస్తున్నారు. మూడ్ ఆఫ్ ద నేషన్ పేరుతో చేసిన సర్వేలో... భారత ప్రధానిగా అర్హుడైన వ్యక్తి ఎవరన్న ప్రశ్నకు... 50 శాతం మంది మోడీకే జై కొట్టారు. కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీకి కేవలం13 శాతం మాత్రమే మద్దతు ఇచ్చారు. సోనియాకు 6 శాతం, కేజ్రీవాల్‌కు 4 శాతం మద్దతు పలికారు.
మరోవైపు ఎన్డీయే పాలనకే జనం జేజేలు పలికారు. ఇప్పటికిప్పుడు లోక్‌సభకు ఎన్నికలు నిర్వహిస్తే ఎన్డీయేకి 304 సీట్లు, యూపీఏకి 94 స్థానాలు, ఇతరులకు 145 సీట్లు వస్తాయని సర్వేలో తేలింది. ఇక ఉత్తమ ప్రధానిగా మోడీ మూడో స్థానంలో నిలిచారు. ఇప్పటి వరకు అత్యుత్తమ పనితీరు కనబర్చిన ప్రధానిగా ఇందిరా ప్రభంజనం సృష్టించారు. ఇందిరమ్మకు 23 శాతం ప్రజలు పట్టంకట్టారు. తర్వాత18 శాతం వాజ్‌పేయికి, 17 శాతం మోడీకి ఓటేశారు.
ఎన్డీయే ప్రభుత్వం ప్రవేశపెట్టిన పథకాల్లో స్వచ్ఛ భారత్ బాగుందని 32 శాతం అభిప్రాయపడ్డారు. 18 శాతం జన్‌ధన్ యోజనకు, 11 శాతం మేకిన్ ఇండియాకు. 8 శాతం డిజిటల్ ఇండియాకు ఓటేశారు. నల్లధనం వెనక్కి తీసుకొస్తామన్న ప్రభుత్వ హామీపై ప్రజలు పెద్దగా నమ్మకం పెట్టుకోలేదు. దీనికి కేవలం 4 శాతం మాత్రమే కితాబునిచ్చారు.
ప్రభుత్వ పనితీరుపై 54% మంది సంతృప్తి వ్యక్తం చేయగా 32% పర్వాలేదన్నారు. 12% అసంతృప్తి వ్యక్తం చేశారు. అచ్ఛేదిన్ వచ్చాయా అంటే రాలేదని 35 శాతం, వచ్చాయని 33 శాతం పేర్కొన్నారు. పాకిస్థాన్‌తో సంబంధాలపై సర్కారు తీరు బాగుందని మెజార్టీ ప్రజలు అభిప్రాయం వ్యక్తం చేశారు.
మోదీ కేబినెట్ మంత్రులందరిలోనూ ఆర్థికశాఖ మంత్రి అరుణ్ జైట్లీ, విదేశాంగ శాఖ మంత్రి సుష్మా స్వరాజ్ పనితీరు బాగుందని సర్వేలో పాల్గొన్న 22 శాతం మంది అభిప్రాయపడ్డారు. రాజ్‌నాథ్‌కు 21 శాతం ఓటేయగా, సురేష్ ప్రభుకు 15 శాతం, ఉమా భారతికి 13 శాతం ఓటేశారు.